చిలకమ్మ స్వేచ్ఛ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

సీతమ్మవారి పాలెం అనే గ్రామంలో బ్రహ్మయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతను కొన్ని రంగు రంగుల పక్షలను పట్టుకొని వాటిని అమ్ముకుని తన జీవనాన్ని కొనసాగించే వాడు. అతని వద్ద మాట్లాడే ఒక రామ చిలుక ఉండేది. దానిని అతను ఒక పంజరంలో బంధించి జాగ్రత్తగా చూసుకునే వాడు . ఒక రోజు ఆ ఊరి జమీందారు అయిన శేషయ్య బ్రహ్మయ్య ఇంటి మీదగా వెళుతూ మాట్లాడే రామచిలుక ను చూసాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు.

శేషయ్య: ” ఆశ్చర్యంగా ఉందే ! ఈ చిలక చాలా ముద్దు ముద్దు గా మాటలు పలుకుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను దానిని మా ఇంటికి తీసుకుని వెళ్తాను ” అని అనుకొని ఆ వేటగాడు ఇంటికి వెళ్ళాడు.

అక్కడకు వెళ్లి ఇలా అడగ సాగాడు.

శేషయ్య : ” బ్రహ్మయ్య ! బ్రహ్మయ్య ఒకసారి బయటకు రా” అని పిలవసాగాడు. అందుకు బ్రహ్మయ్య ఇలా అనసాగాడు.

బ్రహ్మయ్య: ” ఎవరు ? వస్తున్నాను కొంచెం ఆగండి ” అంటూ బయటకు వస్తుండగా.

శేషయ్య : ” నేను బ్రహ్మయ్య జమిందారీ శేషయ్యను ” అని చెప్పగా

అందుకు బ్రహ్మయ్య ఇలా అనసాగాడు

బ్రహ్మయ్య: ” అయ్యా ! షావుకారు గారు మీరా ఏంటి ఇలా దయ చేశారు రండి రండి కూర్చోండి” అని అంటూ పలకరించాడు. అందుకు జమిందారి శేషయ్య ఈ విధంగా అన్నాడు.

శేషయ్య : ” బ్రహ్మయ్య నేను ఇటుగా వెళుతుండగా మీ ఇంటి వద్ద ఆ మాట్లాడే చిలుకను చూశాను. దానిని నాకు ఇవ్వు ” అంటూ శేషయ్య బ్రహ్మయ్యను అడిగాడు.

అందుకు బ్రహ్మయ్య ఈ విధంగా మాట్లాడసాగాడు.

బ్రహ్మయ్య : ” జమీందారు గారు ఈ చిలుక చాలా రోజుల నుంచి నా దగ్గరే ఉంది నేను దానిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాను ” అని చెప్పాడు . అందుకు జమిందారి శేషయ్య ఈ విధంగా అన్నాడు.

శేషయ్య : ” నిజమే కావచ్చు బ్రహ్మయ్య కానీ దాని నాకు ఊరికే ఇవ్వద్దు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను” అని శేషయ్య చెప్పాడు.

ఎంత డబ్బు అయినా అనే మాట విని బ్రహ్మయ్య సరే అన్నాడు.( అందుకు శేషయ్య ఈ విధంగా అన్నాడు)

శేషయ్య : ” సరే బ్రహ్మయ్య నేను వెళ్తున్నాను. నువ్వు ఈ చిలక ని తీసుకుని మా ఇంటి వద్దకు రా. నీకు డబ్బు ఇచ్చి పంపుతాను ” అని అన్నాడు.

బ్రహ్మయ్య : ” జమీందారు గారు నేను ఇప్పుడే మీతో పాటు చిలుకను తీసుకుని వస్తున్నాను” అని చెప్పి అతనితో పాటు బయల్దేరి వెళ్ళాడు బ్రహ్మయ్య.

ఇద్దరూ కలిసి శేషయ్య ఇంటికి చేరుకున్నారు. శేషయ్య ఇంటి లోపలికి వెళ్లి ఒక పెట్టెలో నుంచి పదివేల రూపాయలు తీసుకొని వచ్చి బ్రహ్మయ్య కు ఇచ్చాడు. ఆ పెట్టెలో చాలా డబ్బు, బంగారం ఉంది. దానిని అక్కడి నుంచి చూసిన బ్రహ్మయ్య కు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఆలోచన ద్వారా తనలో తాను ఇలా అనుకోసాగాడు బ్రహ్మయ్య

బ్రహ్మయ్య : ” శేషయ్య ఇంటిలో చాలా డబ్బు , బంగారం ఉన్నది. ఎంతకాలం వీటిని అమ్ముకొని నా జీవితం సాగిస్తాను. అదే ఇక్కడ కొంత డబ్బు , బంగారం దొంగిలించడం ద్వారా నేను హాయిగా జీవనం సాగిస్తాను . దానికోసం ఒక ప్రణాళికను తయారు చేస్తాను ” అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఆ చిలుకను శేషయ్య ఇంటి ముందు పంజరంలో ఉంచి దానిని చాలా బాగా చూసుకొన సాగాడు. రోజులు గడుస్తుండగా ఒకరోజు చిలకమ్మకు కొన్ని చిలకలు బయట ఎగురుతూ కనిపించాయి. అప్పుడు చిలకమ్మా ఈ విధంగా తనలో అనుకొనసాగింది.

చిలకమ్మ : ” అన్ని పక్షులు చాలా స్వేచ్ఛగా హాయిగా ఆనందంతో, ప్రశాంతంగా ఆకాశంలో ఎగురుతున్నాయి. కానీ నేను మాత్రం ఎన్నో రోజుల నుంచి ఈ పంజరంలో బందీగా ఉన్నాను .చాలా బాధ పడుతూ కన్నీరు కార్చింది. చిలకమ్మ అప్పటి నుంచి తనలో తను ఎంతో బాధ పడి పోయింది.

ఇది ఇలా ఉండగా అదే రోజు సాయంత్రం శేషయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగే రోజు శేషయ్య ఇంట్లో ఎవరూ లేరు. మరుసటి రోజు శేషయ్య ఇంటికి వచ్చేసరికి ఇల్లు గందరగోళం చూసి ఎంతో బాధ పడి పోయాడు. డబ్బు , బంగారం అంతా పోయింది అంటూ బోరున ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు చిలకమ్మ ఈ విధంగా మాట్లాడింది.

చిలకమ్మ: ” ఓ ! జమిందారు గారు ఏడవకండి. నిన్న రాత్రి ఈ ఇంటికి బ్రహ్మయ్య వచ్చాడు. అతనే డబ్బు మరియు బంగారం తీసుకొని పోయాడు ” అని చెప్పింది చిలకమ్మ. ఈ విషయం తెలుసుకున్న శేషయ్య అతనిని గాలించి పట్టుకొని, అతని దగ్గర డబ్బు, బంగారం తీసుకొని బాగా బుద్ధి చెప్పి క్షమించి వదిలేశాడు. అప్పుడు శేషయ్య ఇంటికి వచ్చి చిలకమ్మ తో ఈ విధంగా మాట్లాడసాగాడు.

శేషయ్య: ” చిలకమ్మా ! నువ్వు చాలా సహాయం చేశావు. నీకు నేను చాలా రుణపడి ఉన్నాను. అంటూ అని నీకు ఈరోజు నుంచి నీకు ఏం కావాలో చెప్పు ” అని చిలకమ్మను అడిగాడు. అందుకు చిలకమ్మ ఈ విధంగా మాట్లాడసాగింది.

చిలకమ్మ: ” జమీందారు గారు ! మీరు ఈ ఇంటి నుంచి ఒక మూడు రోజులు బయటకు రాకుండా ఎవరితో మాట్లాడకుండా ఉండాలి ” అని చెబుతుంది. అందుకు శేషయ్య ఈ విధంగా అన్నాడు.

శేషయ్య: ” కానీ చిలకమ్మా అలా చేయటం ఎందుకు? అని ప్రశ్నించాడు.

అప్పుడు చిలకమ్మ ” ఏమీ లేదు జమీందారు గారు మీరు నాకు మాట ఇచ్చారు. నేను చెప్పినట్లు చేస్తాను అని అన్నారు కదా! . ఇప్పుడు నేను ఏం చెప్పను. మూడు రోజులు గడిచిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను” అని చెప్పింది.

అందుకు శేషయ్య ” ఈ రోజు నుంచి నేను ఇంటి గదిలో నుంచి బయటకు రాను ” అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు శేషయ్య. ఆ గదిలో అతను ఈ విధంగా అనుకున్నాడు

శేషయ్య : ” ఈ చిలకమ్మ ఎందుకు ఇలా చెప్పింది. రోజు బయట తిరిగే నేను ఇలా ఉండటం నాకు ఏం నచ్చలేదు. నా మిత్రులతో మాట్లాడకుండా ఎవర్ని చూడకుండా నా వల్ల కావటం లేదు” అనుకుని చాలా బాధపడిపో సాగాడు. ఆ మూడు రోజులు గడిచిపోయాయి. శేషయ్య మరుసటి రోజు ఉదయాన్నే బయటకు వచ్చి చిలకమ్మ తో మాట్లాడసాగాడు.

శేషయ్య: ” ఎందుకు చిలకమ్మ నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు? నేను ఈ మూడు రోజులు చాలా నరకం అనుభవించాను. ఇప్పుడు చెప్పు ఎందుకు ఇలా చేసావు ? ” అని అడిగాడు. అందుకు చిలకమ్మ ఇలా అంటుంది.

చిలకమ్మ : ” జమీందారు గారు మీరు కేవలం మూడు రోజులు మాత్రమే గదిలో ఉన్నారు. కానీ నేను మాత్రం ఎన్నో రోజుల నుంచి ఈ పంజరంలో బందీగా పడి ఉన్నాను. మరి నా పరిస్థితి ఏంటి జమీందారు గారు? నాతోటి పక్షులు హాయిగా స్వేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి. ఆ పచ్చ పచ్చని చెట్టు మీద హాయిగా వాలుతూ తమకు కావలసిన పండ్లను తింటూ ఎంతో సంతోషంగా ఉన్నాయి” అని కన్నీరు కారుస్తూ ఎంతో బాధగా మాట్లాడత సాగింది.

దానిని చూసిన జమీందారు గారు ” ఏడవకు చిలకమ్మ . నేను నీ బాధను అర్థం చేసుకున్నాను. నా మూర్ఖత్వంతో ఎన్నో రోజులు నేను నిన్ను బందీగా ఉంచాను” అని బాధపడి పోసాగాడు. తక్షణమే అతను ఆ పంజరం తలుపును తెరిచాడు. అప్పుడు చిలకమ్మ జమీందారు గారికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి ఎగిరిపోయింది .

ఆ రోజు నుంచి ఆ చిలకమ్మ సంతోషంగా జీవించ సాగింది. అప్పుడప్పుడు ఆ జమిందారి ఇంటికి వస్తూ పోతూ అతను ఇచ్చింది తింటూ మరల తన మిత్రులతో కలిసి వెళ్లిపోయింది చిలకమ్మ. అలా వస్తూ ఉండటం జమిందారికి కూడా చాలా సంతోషంగా ఉండేది.

మిత్రులారా! మన సంతోషం కోసం మనం ప్రాణులను బంధించ కూడదు .వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. అవి ఎంతగా బాధ పడుతున్నాయో చిలకమ్మ ద్వారా మనం తెలుసుకున్నాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *