మనుషుల సమయస్ఫూర్తితో పరుగులు తీసిన దెయ్యం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

రామగుండం అనే ఊరిలో కిట్టయ్య, బాలయ్య, సూరయ్య అనే ముగ్గురు స్నేహితులుగా ఉండేవాళ్లు. వాళ్లు చాలా మంచి మిత్రులు. ప్రతిరోజు బయట పనుల కోసం ముగ్గురు కలిసే వెళ్లేవాళ్లు కలిసే వచ్చేవాళ్ళు. అలా ప్రతి రోజు ఉదయాన్నే వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చే వాళ్ళు. ఒకరోజు పని కోసమై కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మార్గమధ్యలో చీకటి పడింది.( అందుకు కిట్టయ్య ఈ విధంగా మాట్లాడసాగాడు)

” బాలయ్య, సూరయ్య చీకటి పడుతుంది మనం ఈరోజు ఎక్కడయినా విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్దాం” అని అన్నాడు. అందుకు వాళ్లు కూడా సరే అన్నారు. వాళ్లతో పాటు సామాన్లు మోయటానికి ఒక గాడిదను కూడా తెచ్చుకున్నారు. దానిని కూడా తీసుకుని అక్కడ దగ్గర్లో ఏదైనా విశ్రాంతి తీసుకొనుటకు స్థలం కోసం అటూ ఇటూ చూడగా, వాళ్లకు కొంచెం దూరంలో ఒక చిన్న దీపం కనపడుతూ ఇల్లు కనపడింది. వాళ్లు ఆ ఇంటి వైపుగా ప్రయాణించటం మొదలుపెట్టారు. చివరికి ఆ ఇంటి లోకి ప్రవేశించారు. అప్పుడు వాళ్లతో బాలయ్య ఈవిధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు .

బాలయ్య: ” అరే! కిట్టయ్య ,సూరయ్య . నాకెందుకో ఈ స్థలం చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ పాతపడిపోయిన సామానులు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తే నాకు భయంగా ఉంది . ఇక్కడ నుంచి వెళ్లి పోదాం పదండిరా ! “

అందుకు వాళ్లు ఈ విధంగా అన్నారు. అరే బాలయ్య ఎందుకు ఈ విధంగా భయపడుతున్నావ్? మేము కూడా ఉన్నాంగా భయపడకు అని అన్నారు. సర్ది చెప్పి ముగ్గురు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో వాళ్లకి ఏదో వింత శబ్దాలు ,అరుపులు వినిపించసాగాయి. వాళ్లకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు వాళ్లు బయటకు వచ్చి చూడగా ఒక పెద్ద దెయ్యం ఆ ఇంటి వైపు గా రావడం గమనించారు. దాన్ని చూసిన వాళ్లు భయంతో ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఇంతలో ఆ దయ్యం ఇంటి దగ్గరకు రానే వచ్చింది.

అందుకు వాళ్లు అయ్యో! మన పని అయిపోయింది అంటూ భయపడిపోయారు.

తలుపులు మూయటంతో ఎవరో ఉన్నారు అనుకొని ” ఎవరు మీరు ? ” అని దెయ్యం పెద్దగా అరిచింది. ( అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ) ” మిత్రులారా! మనం భయపడకూడదు ఈ ప్రమాదం నుంచి బయటపడాలి ” అంటూ తెలివిగా వాళ్ల సమయస్ఫూర్తిని ఉపయోగించి ధైర్యంతో ఒకడు ఇలా అన్నాడు.

” ముందు నువ్వు ఎవరో చెప్పు ” అని పెద్ద గా మాట్లాడాడు. అప్పుడు దెయ్యం ” నేను దెయ్యాన్ని” అని చెప్పింది. అందుకు వాళ్ళలో ఒకడు

” రా! రా! నీ కోసం మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాము. మేము నీకంటే పెద్ద దెయ్యాలం. ఈ రోజు నిన్ను తినడానికే వచ్చాం “అని చెప్పాడు.

ఆ మాట వినగానే దయ్యం ఇలా అనుకుంది “అమ్మో! దెయ్యం . ఈరోజు నా పని అయిపోయింది. నాకంటే పెద్ద దయ్యాలంట. నన్ను తినేస్తాము అని అంటున్నాయి. నాకు భయంగా ఉంది” అనుకొని భయపడుతూ ఇలా అంటుంది.

” మీరు నిజంగా దెయ్యాలే అయితే నీకు నాలాగే పెద్ద చెవులు ఉన్నాయా? ” అని అడిగింది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు ఇలా అన్నాడు. ” లేక ఏం ! నీకంటే పెద్ద చెవులు ఉన్నాయి. లోపలికి రా నీకు చూపిస్తాం” అని అన్నాడు.

అప్పుడు దెయ్యం భయపడి ” నేను లోపలికి రాను. ఈ కిటికీ మధ్యలో నుండి మీ చెవి ని చూపించండి” అని అడిగింది. అందుకు వాళ్లు సరే అన్నారు.
అప్పుడు వాళ్లు తమ దగ్గర ఉన్న సామానులులో నుంచి ఒక చాటను తీసి చెవికి తగిలించుకుని కిటికీ దగ్గర నించున్నాడు.

అప్పుడు దెయ్యం దాని చేతితో కిటికీ మధ్యలో నుంచి చేయి పెట్టి దానిని తాకి చూసింది. ఆ చాటను తాగిన ధైర్యం ఇలా అనుకుంది.

దెయ్యం : ” అమ్మో! ఇవి నిజంగానే నాకంటే పెద్ద దెయ్యాలలాగా ఉన్నాయి. నా కంటే బలమైన పెద్ద చెవులు ఉన్నాయి ” అని అనుకొని మళ్ళీ ఇలా అంటుంది.

” సరే! మరి మీకు నాలాగే పెద్ద తల ఉంటుందా” అని అడిగింది దెయ్యం. అందుకు వాళ్ళు ఇలా అన్నారు ” లేక ఏం ! దానిని కూడా చూడు” అని ఒక పెద్ద కుండ ను తలకు పెట్టుకుని ఒకడు దానికి చూపించాడు. దానిని తాకిన దయ్యం ఇలా అనుకుంటుంది.

” నిజమే నా కంటే పెద్ద తల కూడా ఉంది ” అనుకొని . ” మళ్లీ ఒకటి నేను పెద్దగా అరవ గలను. మరి మీరు కూడా అలా అరవగలరా? ” అని అడిగింది. అరే! అని దెయ్యం పెద్దగా ఒక అరుపు అరిచింది.

అప్పుడు ఆ దెయ్యం ఇప్పుడు మీ వంతు అని అడగగా వాళ్ళు. తమ దగ్గర ఉన్న గాడిదను కర్రతో గట్టిగా కొట్టడంతో ఆ గాడిద పెద్దగా అరిచింది. ఆ అరుపు విని ఆ పెద్ద దయ్యం భయంతో పరుగులు తీసింది.

దానిని అంతా చూస్తున్న వాళ్లు దెయ్యం వెళ్ళిపోయింది అని హాయిగా విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ! మనకు ప్రమాదం ఎదురైనప్పుడు భయపడకూడదు. సమయస్ఫూర్తితో ఆ ప్రమాదం నుంచి బయట పడే మార్గం వెతుక్కోవాలి. ఏ విధంగా ఆ మిత్రులు ప్రమాదం నుంచి బయటపడ్డారో అదే విధంగా.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *